జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం
–తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య.
హైదరాబాద్ సిటీ, కూకట్ పల్లి ప్రతినిధి అంజిబాబు, జూలై 24, (జన సంఘర్షణ):
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే వరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య అన్నారు. కూకట్ పల్లిలోని ఏ ఎస్ రాజు నగర్ కమ్యూనిటీ హాలులో శుక్రవారం రోజు కూకట్ పల్లి నియోజకవర్గం మహాసభ నిర్వహించారు. ఆ సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కట్టెల మల్లేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సోమయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డుతో పాటు హెల్త్ కార్డు ఇతర సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వంతో పోరాటం చేస్తామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా జర్నలిస్టులను మోసం చేసింది అన్నారు. మూడు నెలలు గడుస్తున్నప్పటికీ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేని అసమర్ధ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. సంఘం ఏర్పాటు నుండి నేటి వరకు నిరంతరం జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక సంఘం టిడబ్ల్యూజేఎఫ్ అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ మాట్లాడుతూ ఐక్యమత్యం తోనే అన్ని సాధ్యమవుతాయన్నారు. జర్నలిస్టులను విడదీయడం వల్ల వారి సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగే విధంగా ఇతర సంఘాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వంతోపాటు వారితో కుమ్మక్కైన జర్నలిస్టు సంఘాల ఎత్తులను చిత్తు చేసే విధంగా భవిష్యత్తులో వ్యూహాత్మక పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యత లోపించడం వల్ల కూకట్ పల్లి నియోజకవర్గంలోని జర్నలిస్టులు ఇప్పటికే చాలా వరకు నష్టపోయారని గుర్తు చేశారు. అనంతరం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కట్టెల మల్లేశం కూకట్ పల్లి నియోజకవర్గ కమిటీని ప్రతిపాదించగా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అధ్యక్షులుగా ఎర్ర యాకయ్య :
అధ్యక్షులుగా ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శిగా నాగుల అంజిబాబు, కోశాధికారిగా షబ్బీర్, ఉపాధ్యక్షులుగా బొమ్మ గోపి, కార్యవర్గ సభ్యులుగా నవీన్, సుజాత, నాగరాజు గౌడ్, శ్యాంసుందర్, సైదులు లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ విద్యా వెంకట్, టిడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు దామెర జగదీశ్వర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నాగరాజు గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ రవికుమార్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు వంగాల కొండల్ రెడ్డి, చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


