బోధన్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పి.సమ్మయ్య…
బోధన్,జులై 01(జన సంఘర్షణ)
బోధన్ బార్ అసోసియేషన్ 2026-27 ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పి.సమ్మయ్య ను తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. మార్చిలో జరిగిన బోధన్ బార్ అసోసియేషన్ 2026-27 ఎన్నికలకు సంబంధించిన వివాదంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. రిట్ పిటిషన్ నెం.9805/2026లో 24-06-2026న ఇచ్చిన తీర్పులో సమ్మయ్య అడ్వకేట్ ను బోధన్ బార్ అసోసియేషన్ 2026-27 సంవత్సరానికి చట్టబద్ధంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శిగా ప్రకటించింది. ఎన్నికల ఓట్ల లెక్కింపులో సమయ్య పి. అనుకూలంగా నమోదైన ఒక ఓటును, స్వస్తిక్ గుర్తు బదులుగా టిక్ (/) గుర్తు ఉన్నదనే కారణంతో ఎన్నికల అధికారి తిరస్కరించారు. అనంతరం ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చాయని ప్రకటించి, ప్రధాన కార్యదర్శి పదవిని ఆరు నెలల చొప్పున పంచుకోవాలని నిర్ణయించారు. ఈ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ను విచారించిన హైకోర్టు టిక్ (వి) గుర్తు ద్వారా ఓటరు ఉద్దేశ్యం స్పష్టంగా వ్యక్తమైందని, అలాంటి ఓటును తిరస్కరించేందుకు బార్ అసోసియేషన్ బై-లాస్లో ఎలాంటి నిబంధన లేదని స్పష్టం చేసింది. అదేవిధంగా, ప్రధాన కార్యదర్శి పదవిని ఇద్దరు అభ్యర్థులు ఆరు నెలల చొప్పున నిర్వహించేలా నిర్ణయించేందుకు ఎన్నికల అధికారికి ఎటువంటి చట్టబద్ధమైన అధికారం లేదని పేర్కొంది. దీంతో తిరస్కరించిన ఓటును చెల్లుబాటు అయ్యేదిగా గుర్తించిన హైకోర్టు సమ్మయ్య కి మొత్తం 54 చెల్లుబాటు అయ్యే ఓట్లు ప్రత్యర్థి అభ్యర్థికి 53 ఓట్లు వచ్చినట్లు ప్రకటించి, బోధన్ బార్ అసోసియేషన్ 2026-27 సంవత్సరానికి ప్రధాన కార్యదర్శిగా చట్టబద్ధంగా ఎన్నికైన అభ్యర్థిగా ప్రకటించింది. సంబంధిత అధికారులు ఈ తీర్పును తక్షణమే అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ప్రజాస్వామ్య ఎన్నికలలో ఓటరు ఉద్దేశ్యానికే అత్యున్నత ప్రాధాన్యత ఉంటుందని, సాంకేతిక కారణాలతో ఓటును తిరస్కరించరాదని, ఎన్నికల అధికారులు తమ అధికార పరిమితుల్లోనే వ్యవహరించాలని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్.పి.సమ్మయ్య అడ్వకేట్ మాట్లాడుతూ,… తనపై విశ్వాసం ఉంచి మద్దతు తెలిపిన బోధన్ బార్ అసోసియేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. న్యాయం కోసం తన తరఫున వాదించిన న్యాయవాదులకు, సహచరులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. బార్ అసోసియేషన్ గౌరవాన్ని కాపాడుతూ, ప్రతి సభ్యునికి సమాన సేవలు అందించేందుకు పారదర్శకత, ఐక్యత మరియు నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు.ఈ సమావేశంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం .గంగారెడ్డి, బార్ అసోసియేషన్ కోశాధికారి బానోత్ రమేష్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు రాఘవేందర్, అనిల్ కుమార్, న్యాయవాదులు ఎస్ ఎస్ ఆర్ కోటేశ్వరరావు, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.


