♦ “సీతారామ ప్రాజెక్టుపై భద్రాద్రి జిల్లాకు అన్యాయం.. మంత్రులు సమాధానం చెప్పాలి!”
♦ “రైతుల పక్షాన ప్రశ్నిస్తే నిర్బంధాలా? ప్రజాస్వామ్య విరుద్ధమన్న BRS మండల కమిటీ”
ప్రభుత్వం ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా, లాఠీలు, తూటాలతో నిర్బంధాలు విధించినా ప్రజా సమస్యలపై BRS పార్టీ చేసే పోరాటాలు ఆగవని ఆ పార్టీ సుజాతనగర్ మండల కమిటీ స్పష్టం చేసింది. సీతారామ ప్రాజెక్టు విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు జరుగుతున్న అన్యాయంపై తాము రాజీలేని పోరాటం చేస్తామని నేతలు ప్రకటించారు.
ఉప ముఖ్యమంత్రితో సహా ముగ్గురు మంత్రులు జిల్లా ప్రజలకు, రైతులకు సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని BRS శ్రేణులు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ప్రజా క్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని వారు పేర్కొన్నారు.
సీతారామ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మంత్రులు సందర్శిస్తున్న నేపథ్యంలో, జిల్లా రైతాంగం పక్షాన నిలబడి వారిని ప్రశ్నించాలని BRS పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ముందస్తు చర్యల పేరుతో సుజాతనగర్ మండల BRS పార్టీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
తమ పార్టీ పుట్టిందే ఉద్యమాలతోనని, అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర BRS పార్టీకి ఉందని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేశారు. ఇలాంటి ముందస్తు అరెస్టులకు తాము భయపడే ప్రసక్తే లేదని, రైతుల హక్కుల కోసం నిరంతరం గళం విప్పుతామని స్పష్టం చేశారు.
సీతారామ ప్రాజెక్టు విషయంలో భద్రాద్రి జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని BRS పార్టీ ఆరోపించింది. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ ప్రాజెక్టు పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయని, దీనివల్ల జిల్లాలోని రైతాంగం తీవ్రంగా నష్టపోతూ ఆవేదన చెందుతోందని నాయకులు ఆరోపించారు.
పక్కనే ఉన్న ఖమ్మం జిల్లా రైతులకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వడం ఆనందదాయకమేనని, కానీ అదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులను విస్మరించి వారిని ఆగం చేయడం ఎంతవరకు న్యాయమని నేతలు ప్రశ్నించారు. ఈ వివక్షను తాము సహించేది లేదన్నారు.
సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదలయ్యే గోదావరి జలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న చివరి ఎకరం భూమి వరకు అందేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. యావత్ భద్రాద్రి జిల్లా రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, వారి నుంచి సరైన సమాధానాలు రాబడతామని వెల్లడించారు.
రైతుల సమస్యలపై ప్రశ్నించినందుకు ఇలాంటి నిర్బంధ చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని అన్నారు. ఈరోజు సుజాతనగర్ పోలీస్ స్టేషన్‌లో అక్రమ అరెస్టు అయిన వారిలో BRS పార్టీ మండల అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్, సీనియర్ నాయకులు పెద్దమల్ల నరేందర్ ప్రసాద్, చింతలపూడి జగన్, మాసిన శ్రీకాంత్, పులి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.


