Homeఎడిటోరియల్ఇల్లందు ప్రైవేట్ పాఠశాలలో దారుణం: విద్యార్థిపై ప్రిన్సిపల్, టీచర్ తీవ్ర విచక్షణారహిత దాడి

ఇల్లందు ప్రైవేట్ పాఠశాలలో దారుణం: విద్యార్థిపై ప్రిన్సిపల్, టీచర్ తీవ్ర విచక్షణారహిత దాడి

📰 Generate e-Paper Clip

♦ ఫీజులు కట్టి తన్నులు తినాలా? పాఠశాల యాజమాన్యంపై తల్లిదండ్రుల తీవ్ర ఆగ్రహం

♦ విద్యార్థిని తీవ్రంగా దండించిన పాఠశాల ప్రిన్సిపల్.. పోలీసు కేసు పెడతామని హెచ్చరిక!

♦ ఇల్లందులో ప్రైవేట్ స్కూల్ నిర్వాహకుల వైఖరిపై విమర్శల వెల్లువ.. పెద్ద మనుషుల పంచాయితీ!

♦ విద్యార్థిపై ఉపాధ్యాయుల చేతివాటం: పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైన ఘటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ ప్రవర్తించిన తీరు తీవ్ర కలకలం రేపింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన స్థానంలో ఉన్నవారే క్రూరంగా ప్రవర్తించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. నాలుగైదు రోజుల క్రితం ఇల్లందు పట్టణంలోని ఒక ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థిని, సదరు పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఒక ఉపాధ్యాయురాలు ఇద్దరూ కలిసి తీవ్రంగా దండించారు.

పాఠశాల నిర్వాహకుల చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థి, తనకు జరిగిన అన్యాయాన్ని మరియు దండించిన విషయాన్ని వెంటనే తన తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థిని అంత దారుణంగా దండించిన ప్రిన్సిపాల్‌ను, సంబంధిత ఉపాధ్యాయురాలిని తీవ్ర స్థాయిలో నిలదీసి మందలించారు.

ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యంపై తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “మేము అడిగినంత ఫీజులు చెల్లించి, హాస్టల్లో వేసి చదివిస్తుంటే.. మా పైసలు తింటూ మా పిల్లలనే కొడతారా? మీతో తన్నులు తినిపించడానికే మేము ఫీజులు కడుతున్నామా?” అని నిలదీశారు.

పాఠశాల యజమాన్యం నిర్లక్ష్య సమాధానాలు, ఉపాధ్యాయుల వైఖరిపై సంతృప్తి చెందని తల్లిదండ్రులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావించారు. ఈ క్రమంలో పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసేందుకు సైతం సిద్ధపడ్డారు.

విషయం పోలీసు కేసు వరకు వెళ్తుండటంతో పాఠశాల యజమాన్యం ఆందోళనకు గురైంది. ఈ క్రమంలో సదరు విద్యార్థి గ్రామానికి చెందిన ఒక పెద్దమనిషి రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహించారు. విద్యార్థి తల్లిదండ్రులకు నచ్చజెప్పి పంచాయితీ చేశారు.

సదరు పెద్దమనిషి సమక్షంలో పాఠశాల యజమానికి, ఉపాధ్యాయులకు గట్టి హెచ్చరికలు జారీ చేసి, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని మందలించి వదిలేసినట్లు సమాచారం. అయితే, ఈ ఘటన ప్రస్తుతం ఇల్లందు పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular