

— ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసిన కూకట్పల్లి టిడబ్ల్యూజెఎఫ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు.
హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, అక్టోబర్ 28, (జన సంఘర్షణ):
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం అంబేద్కర్ భవనంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఉదయం 10 గంటలకు కేక్ కట్ చేసి సీనియర్ జర్నలిస్టులకు సన్మానం చేసి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, కూకట్పల్లి టిడబ్ల్యూజెఎఫ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా కూకట్పల్లి అధ్యక్షులు యాకయ్య మాట్లాడుతూ 1950 అక్టోబర్ 28న న్యూఢిల్లీలో స్థాపించబడిన ఈ సంస్థ స్వతంత్ర భారతదేశంలో మీడియా ఉద్యోగుల కోసం ఏర్పాటైన తొలి ట్రేడ్ యూనియన్‌గా గుర్తింపు పొందిందాని, దేశంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వేతన సవరణలు, ఉద్యోగ భద్రత, మెరుగైన పని పరిస్థితుల కోసం నిరంతరం పోరాడుతుందని, ఐఎఫ్‌డబ్ల్యూజే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 30 వేలకు పైగా ప్రాథమిక, అనుబంధ సభ్యులతో కొనసాగుతోంది. ఎలక్ట్రానిక్ మీడియా, వార్తా సంస్థలు, 17 భాషలకు చెందిన సుమారు 1,260 పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తోంది. విదేశాల్లోని వివిధ ఖండాల్లో పనిచేస్తున్న భారతీయ జర్నలిస్టులు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. దేశంలోని నగరాలు, పట్టణాలు, పత్రికా కేంద్రాల్లో శాఖలను కలిగి ఉన్న ఈ సంస్థ జర్నలిస్టుల వృత్తిపరమైన అభివృద్ధికి కృషి చేస్తోందని, 1977లో జరిగిన సభ్యత్వ పరిశీలనలోనూ సంస్థ ప్రాతినిధ్య స్వరూపం పునరుద్ఘాటించబడింది. వేతన బోర్డులు, ప్రెస్ కౌన్సిల్, అక్రిడిటేషన్ కమిటీలు, మీడియా సంప్రదింపుల కమిటీల్లో సంస్థ ప్రతినిధులకు చోటు లభించింది. గత 75 ఏళ్లుగా సంస్థ సాగించిన ఉద్యమాల ఫలితంగా 1956లో జర్నలిస్టుల పని గంటలు, సేవా పరిస్థితులకు సంబంధించిన చట్టపరమైన చర్యలు ముందుకు సాగాయి. 1954, 1980లో ప్రెస్ కమిషన్ల ఏర్పాటు, 1959 నుంచి వేతనాల సవరణలు, చట్టబద్ధ ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు వంటి పరిణామాల్లోనూ సంస్థ కీలక పాత్ర పోషించిందని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ -మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీద అశోక్, చైతన్య రెడ్డి, కార్యవర్గ సభ్యులు సుజాత, ఉజ్వల రెడ్డి, శివ, విష్ణుమూర్తి, పి. సురేష్, రాజ్ కుమార్ యాదవ్, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.


