కల్తీ కల్లులో మత్తు పదార్థాలు కలిపినట్లు విచారణలో వెల్లడి.. ఇద్దరిపై కేసులు.. అసలు సరఫరాదారుడు విజయ్ గౌడ్‌పై కేసు ఎప్పుడు? దాడుల తర్వాత కూడా విక్రయాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు.. అధికారుల తీరుపై గ్రామస్థుల ఆగ్రహం..!
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో | నవంబర్ 11 | జన సంఘర్షణ
కల్తీ కల్లు రూపంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేది ఎప్పుడు? ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే మత్తు పదార్థాల కల్తీ వెనుక ఉన్న అసలు వ్యక్తులపై చర్యలు తీసుకునేది ఎవరు? దుకాణంపై దాడులు చేసి ఇద్దరిపై కేసులు నమోదు చేసిన అధికారులు, కల్తీ కల్లును తయారుచేసి సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నలు ఇప్పుడు బీర్కూర్ మండలంలో చర్చనీయాంశంగా మారాయి.
*బీర్కూర్ మండలం దామరంచ గ్రామంలోని. కల్లు దుకాణంలో కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో మంగళవారం సాయంత్రం నార్కోటిక్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కల్లు సేవించిన పలువురి మూత్ర నమూనాలను పరీక్షించగా, కల్లులో మత్తు పదార్థాలు కలిపినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై టీఎఫ్టీ లైసెన్స్‌దారుడు రవీందర్ గౌడ్, దుకాణం నిర్వాహకుడు పండగ గౌడ్లపై బీర్కూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.
*అయితే ఈ కల్తీ కల్లు దందా కేవలం.దామరంచ దుకాణానికే పరిమితమైందా? లేక దీని వెనుక పెద్ద సరఫరా వ్యవస్థ పనిచేస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో తయారుచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్న కల్తీ కల్లును రాత్రి వేళల్లో ఇతర మండలాలకు తరలించి విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఈ సరఫరా జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
*దుకాణం నిర్వాహకులపైనే చర్యలా.. అసలు వ్యక్తుల సంగతేంటి.!
కల్తీ కల్లు ఎక్కడ తయారవుతోంది? ఎవరు తయారుచేస్తున్నారు? ఎవరి ద్వారా రవాణా జరుగుతోంది? ఎవరి సహకారంతో ఇతర ప్రాంతాల్లో విక్రయాలు సాగుతున్నాయి? అనే అంశాలపై లోతైన విచారణ జరగాల్సి ఉంది. దుకాణం నిర్వాహకులు, లైసెన్స్‌దారులపై కేసులు నమోదు చేయడం మాత్రమే సరిపోదని, సరఫరా వ్యవస్థలో కీలకంగా ఉన్న వ్యక్తులను కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
*ఈ విషయంపై. ఎక్సైజ్ శాఖ సీఐ లావణ్యను వివరణ కోరగా, నార్కోటిక్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం వాస్తవమేనని, ఇద్దరిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. కల్తీ కల్లు సరఫరా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా, మరో సమావేశంలో ఉన్నానని, తర్వాత సమాధానం చెబుతానని పేర్కొన్నారు.
మరోవైపు నార్కోటిక్ ఎస్సై పూర్ణేశ్వర్ స్పందిస్తూ, కల్తీ కల్లు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ గౌడ్‌పై కేసు నమోదు చేస్తామని, అతని కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
*దాడులు చేసినా మారని పరిస్థితి.. అధికారుల నిఘా ఎక్కడ..!
నార్కోటిక్ పోలీసులు దాడులు నిర్వహించి కల్తీ కల్లు వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ, దామరంచలో మళ్లీ యథావిధిగా కల్లు విక్రయాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు పోలీసులు కేసులు నమోదు చేస్తుంటే, మరోవైపు విక్రయాలు కొనసాగుతున్నాయనే విమర్శలు అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
*కల్లు డిపో నిర్వాహకులకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా..!!* అధికారుల సహకారం లేకుండానే ఇంత పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా కల్తీ కల్లు సరఫరా సాధ్యమవుతుందా? అనే సందేహాలను గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులపై మామూళ్ల ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
*ప్రజల ప్రాణాల కంటే అక్రమ వ్యాపారమే ముఖ్యమా..!!*
కల్తీ కల్లు సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున, ఇలాంటి వ్యాపారంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ప్రాణనష్టం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అక్రమ తయారీ, సరఫరా, విక్రయాలను అరికట్టాలని కోరుతున్నారు.
*ఇప్పటికైనా జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పందించి..!!* పోచారం నుంచి దామరంచ వరకు కల్తీ కల్లు సరఫరా వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలి. రాజకీయ పలుకుబడి ఉన్నా, అధికారుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చినా, విచారణలో తేలిన ప్రతి ఒక్కరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. దాడులతోనే సరిపెట్టకుండా కల్తీ కల్లు దందాకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
*ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులదే..!!* కల్తీ కల్లు దందా వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరైనా సరే చట్టం ముందు నిలబెట్టాలని ప్రజలు హెచ్చరిస్తున్నారు.


