– బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
ప్రభుత్వ పెద్దలు – ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంత పరిశీలన
బోధన్: ఫిబ్రవరి 26
జన సంఘర్షణ
ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా చొరవతో ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి,ఆదిలాబాద్ ఎంపీ గోదాం నగేష్,ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ,జిల్లా కలెక్టర్ రాజర్షి షా తదితరులు భోరజ్ మండలంలోని కొర్టా చనాకా ప్రాజెక్ట్ సమీపంలో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంతాన్ని సందర్శించారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాలు, ప్రభుత్వ భూములు, సాగుభూములు, సాగుకు అనర్హ భూముల వివరాలను పరిశీలించారు. ముఖ్యంగా పెంగంగ నది సమీప ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాలో 10,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సృష్టించేందుకు ప్రణాళిక రూపొందించామని, ఇప్పటికే 6,000 ఎకరాలను గుర్తించామని తెలిపారు. నీరు, విద్యుత్, జాతీయ రహదారి, రైల్వే, ప్రతిపాదిత విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించడం, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, రైతుల భూముల విలువ పెరగడం, జిల్లా ఆర్థికాభివృద్ధి సాధించడమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎస్పీ, ఏసీ రెవెన్యూ, ఏసీ లోకల్ బాడీస్ సహా ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


