Homeఎడిటోరియల్పాలకుల వివక్షపై పాత్రికేయులు పోరాటాలకు సిద్దం కావాలి

పాలకుల వివక్షపై పాత్రికేయులు పోరాటాలకు సిద్దం కావాలి

📰 Generate e-Paper Clip

పాలకుల వివక్షపై పాత్రికేయులు పోరాటాలకు సిద్దం కావాలి

–టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

–ఘనంగా కూకట్ పల్లి మహాసభ.

 

 

హైదరాబాద్ సిటీ , కూకట్పల్లి ప్రతినిధి అంజిబాబు,జూలై 24, (జన సంఘర్షణ):

తెలంగాణ ఉద్యమంలో త్యాగాలకు సిద్దపడి పోరాడిన జర్నలిస్టులు పాలకుల వివక్ష కు, నిర్లక్ష్యానికి గురవుతున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు కనీసం అక్రెడిటేషన్లు సక్రమంగా ఇవ్వలేని దుస్థితి నెలకొందని, దీనిపై రోడ్లెక్కి ఆందోళన చేయాల్సి దౌర్భాగ్యమైన పరిస్థితి రావడం బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రోజు కూకట్ పల్లిలోని ఏఎస్ రాజు నగర్ కమ్యూనిటీ హాల్ లో టీడబ్ల్యూజేఎఫ్ కూకట్ పల్లి నియోజకవర్గం మహాసభ ఘనంగా జరిగింది. ఈ మహాసభలో మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై టీడబ్ల్యూజేఎఫ్ రాజీలేని పోరాటం చేస్తుందని అన్నారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సహించరానిదని, పాలకుల నిర్లక్ష్యం, వివక్షపై రాబోయే రోజుల్లో పాత్రికేయుల పోరాటం తీవ్రతరం చేయాల్సి వస్తుందని అన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులను చిన్న చూపు చూస్తున్నదని, జర్నలిస్టులకున్న ఏకైక సదుపాయం అయిన రైల్వే చార్జీలో 50 శాతం రాయితీని ఎత్తివేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలపై ఈనెల 27న “ఛలో పార్లమెంట్” కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ ను మరింత బలోపేతం చేసి, రాబోయే రోజుల్లో సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని అన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ఏ రాజకీయ పార్టీకి గానీ, ఏ ఒక్క పత్రికకు గానీ అనుబంధం కాదని, ఈ అపోహలతో జర్నలిస్టులు అయోమయంలో పడొద్దని అన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు కట్టెల మల్లేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ సభ్యుడు జగదీశ్వర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నాగరాజు గౌడ్, సీనియర్ జర్నలిస్టులు విద్యా వెంకట్, ఎర్ర యాకయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది అశోక్, ఉపాధ్యక్షుడు కొండల్ రెడ్డి,హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

కూకట్ పల్లి కమిటీ ఎన్నిక:

ఈ మహాసభ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నూతన కమిటీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎర్ర యాకయ్య, ఉపాధ్యక్షుడిగా బొమ్మ గోపి,ప్రధాన కార్యదర్శిగా నాగుల అంజిబాబు, సంయుక్త కార్యదర్శిగా నాగార్జున,కోశాధికారిగా షబ్బీర్, కార్యవర్గ సభ్యులుగా నాగరాజు గౌడ్,సైదులు, శ్యాం సుందర్,జే. నవీన్, సుజాత, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా మహేందర్ తదితరులు ఎన్నికయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular