Homeఇల్లందువిద్యాసంస్థల్లో వేడుకల పేరుతో లక్షల వసూళ్లు.. ఇల్లందు ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లిన TNSF

విద్యాసంస్థల్లో వేడుకల పేరుతో లక్షల వసూళ్లు.. ఇల్లందు ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లిన TNSF

📰 Generate e-Paper Clip

♦ ఆటపాటలు ఉల్లాసానికే గానీ.. విద్యాసంస్థల ఖజానాలు నింపుకోవడానికి కాదు: దాసరి గోపాలకృష్ణ

♦ ప్రైవేట్ విద్యాసంస్థల దందాపై చర్యలు తీసుకోకపోతే కార్యక్రమాలను అడ్డుకుంటాం: చందావత్ రమేష్ బాబు

♦ ఫేర్‌వెల్, అన్యువల్ డే వేడుకల పేరిట కార్పొరేట్ విద్యాసంస్థల ఆర్థిక దోపిడీ

నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అన్యువల్ డే, ఫ్రెషర్స్ డే, ఫేర్‌వెల్ పార్టీల పేరుతో విద్యార్థుల నుంచి భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేస్తూ తమ ఖజానాలు నింపుకుంటున్నాయని తెలుగునాడు విద్యార్థి సమైక్య (TNSF) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కృతి, ఉత్సాహం పేరిట యాజమాన్యాలు చేస్తున్న ఈ ఆర్థిక దోపిడీని తక్షణమే అరికట్టాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకుడు, సర్పంచ్ చందావత్ రమేష్ బాబు, పట్టణ అధ్యక్షుడు దాసరి గోపాలకృష్ణ డిమాండ్ చేశారు.

పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలైనా విద్యార్థుల మానసిక ఉల్లాసానికి, వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయడానికి మాత్రమే ఉపయోగపడాలని వారు స్పష్టం చేశారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా నామమాత్రపు రుసుములతో లేదా యాజమాన్య నిధులతోనే ఈ వేడుకలను నిర్వహించాలని, కానీ దానికి భిన్నంగా ఒక్కో విద్యార్థి నుంచి వేల రూపాయలు గుంజుతూ లక్షల రూపాయలు దోచుకోవడం అన్యాయమని విమర్శించారు.

గత విద్యా సంవత్సరంలో కూడా కొన్ని విద్యాసంస్థలు ఇలాగే పరిమితికి మించి నిధులు వసూలు చేసిన ఉదంతాలపై ఆధారాలతో సహా ఇల్లందు మండల విద్యాశాఖ అధికారి (MEO)కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వారు గుర్తుచేశారు. ఆ సమయములో పూర్తిస్థాయి విచారణ జరిపి, విద్యాసంస్థలపై తగు చర్యలు తీసుకుంటామని ఎంఈఓ హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఈ విద్యాసంవత్సరంలో కూడా గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా అధికారులు ముందుగానే కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. విద్యా కార్యక్రమాల పేరుతో తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పొడిచేలా అధిక మొత్తంలో ఫీజులు లేదా చందాలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.

విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఐక్యం చేసి ప్రైవేట్ యాజమాన్యాల ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, విద్యాసంస్థల్లో జరిగే ఇలాంటి అక్రమ కార్యక్రమాలను అడ్డుకుంటామని TNSF నాయకులు స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ అధికారులు తక్షణమే నిఘా పెట్టి నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular