
— దేశ ప్రగతికి రాజీవ్ చూపిన బాట…
— రాజీవ్ ఆశయాలతో ముందుకు సాగుదాం…
— కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఘనంగా 82వ జయంతి వేడుకలు…
హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు,ఆగస్టు 21, (జన సంఘర్షణ):
కూకట్‌పల్లి: దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో గురువారం ఘనంగా నిర్వహించారు. కె.పి.హెచ్.బి., మూసాపేట్, బాలానగర్, ప్రకాష్‌నగర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాలు నిర్వహించి ఆయన సేవలను స్మరించుకున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్, కేపీహెబీ డివిజన్ అధ్యక్షులు అరవింద్ రెడ్డి, వసంతనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిలారు శ్రీనివాస్‌బాబు, బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షులు రాజేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ చేసిన విశిష్ట సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువతకు పెద్దపీట వేస్తూ దేశ భవిష్యత్తుకు బాటలు వేసిన దార్శనిక నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


