♦ ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి: 5 లక్షల మంది విద్యార్థుల సంతకాల సేకరణ
♦ ఉస్మానియాకు ఇస్తామన్న రూ.1,000 కోట్లు ఏవి? సిఎం రేవంత్‌పై ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
♦ విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల దురుసుతనం కాంగ్రెస్ నిరంకుశత్వానికి నిదర్శనం
♦ హామీలను తుంగలో తొక్కిన రేవంత్ రెడ్డి వెంటనే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలైకై బిజెవైఎం ఆధ్వర్యంలో ‘ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఉద్యమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ కళాశాలలకు వెళ్లి దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల నుంచి స్వయంగా సంతకాలు సేకరించామని రాంచందర్ రావు తెలిపారు. “మా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి” అని విద్యార్థులు సంతకాల ద్వారా కాంగ్రెస్ పాలనపై తమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
తమ న్యాయమైన హక్కుల కోసం కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి స్పష్టమైన నిదర్శనమని ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జ్ చేయించడం, ఆయుష్, హోమియోపతి విద్యార్థులు స్టైఫండ్ల కోసం ఆందోళన చేస్తున్నా స్పందించకపోవడం దారుణమన్నారు.
విద్యాశాఖను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారే పర్యవేక్షిస్తున్నప్పటికీ, విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికొదిలేశారని రాంచందర్ రావు ఆరోపించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లి రూ.1,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి, ఇప్పటివరకు రూ.1,000 కూడా విడుదల చేయకపోవడం విద్యార్థులను మోసం చేయడమేనని ఆయన దుయ్యబట్టారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను పెండింగ్‌లో పెడితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.4 వేల కోట్లు పెంచి మొత్తం బకాయిలను రూ.12 వేల కోట్లకు చేర్చిందని గణాంకాలతో సహా వివరించారు. దీనివల్ల రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నుంచి నిధులు సమయానికి విడుదల కాకపోవడంతో ఒకవైపు కళాశాల యాజమాన్యాలు అధ్యాపకులకు జీతాలు చెల్లించలేకపోతున్నాయని, మరోవైపు కోర్సులు పూర్తయినా విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లను అందజేయకుండా నిలిపివేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ పేరుతో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు విద్యార్థులకు ఇచ్చిన స్కాలర్షిప్లు, ఫీజుల చెల్లింపు హామీలను పూర్తిగా విస్మరించిందని రాంచందర్ రావు విమర్శించారు. హైకోర్టు హెచ్చరికల తర్వాత కూడా అడ్వాన్స్‌గా ఇస్తామన్న రూ.2 వేల కోట్లను విడుదల చేయలేకపోయిందన్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులను రెచ్చగొట్టడం మానుకోవాలని సూచించారు. దమ్ముంటే తెలంగాణకు వచ్చి, ఇక్కడి విద్యార్థులకు కాంగ్రెస్ సర్కారు ఎగ్గొట్టిన రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సమాధానం చెప్పాలని రాంచందర్ రావు నేరుగా సవాల్ విసిరారు.
మరోవైపు నరేంద్ర మోదీగారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అపారమైన అవకాశాలను కల్పిస్తోందని ఎన్. రాంచందర్ రావు కొనియాడారు. నేడు భారత్ అంతరిక్షంలోకి రాకెట్లను పంపే స్థాయికి ఎదిగిందని, అయితే తెలంగాణలో మాత్రం విద్యార్థులు చదువుల కోసం, బకాయిల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి కాంగ్రెస్ వల్ల వచ్చిందని పోల్చి చెప్పారు.
విద్యాశాఖ బాధ్యతలను స్వీకరించి కూడా విద్యార్థుల కనీస సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తమ పోరాటం ఆగదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైనా భారతీయ జనతా పార్టీ అగ్రభాగాన నిలిచి పోరాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి ఫీజుల బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించేంత వరకు ప్రజా ఉద్యమాలు, నిరసన కార్యక్రమాల ద్వారా నిరంతరం ఒత్తిడి తెస్తూనే ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హెచ్చరించారు.


