*వికలాంగుల జీవితాల్లో కొత్త వెలుగు.. పోచారం భాస్కర్ రెడ్డి*
* కృత్రిమ అవయవాల పనితీరు పరిశీలన.. “ప్రతి వికలాంగుడి ఇంటికి అండగా నిలుస్తా”
నిజామబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో/ అక్టోబర్ 5:/(జన సంఘర్షణ)
వికలాంగుల జీవితాల్లో కొత్త ఆశలు నింపాలనే సంకల్పంతో కృత్రిమ అవయవాలు అందించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి వాటి పనితీరును స్వయంగా పరిశీలించారు. గతంలో బాన్సువాడ పట్టణానికి చెందిన యాదగిరి, కరణ్, మహమ్మద్లకు అందించిన కృత్రిమ అవయవాలు వారికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో తెలుసుకునేందుకు వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా కృత్రిమ అవయవాలను ఉపయోగిస్తున్న విధానాన్ని పరిశీలించిన భాస్కర్ రెడ్డి, వాటిని వినియోగించడంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సమయంలో భవిష్యత్తులో కూడా తనవంతు సహకారం అందిస్తానని వారికి భరోసా ఇచ్చారు.
భాస్కర్ రెడ్డి తమ ఇళ్లకు రావడంతో యాదగిరి, కరణ్, మహమ్మద్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కృత్రిమ అవయవాలు పొందలేని తమలాంటి వారికి అండగా నిలిచి, జీవితంలో మళ్లీ ముందుకు సాగేందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
వికలాంగుల ప్రతి ఇంటికీ అండగా..
ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలోని ఏ మండలంలోనైనా వికలాంగులు ఉంటే వారి వివరాలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు. తనకు నేరుగా సమాచారం ఇవ్వడంతో పాటు, మిత్రులు, కార్యకర్తల ద్వారా కూడా వివరాలను తెలియజేయాలని సూచించారు.
“వికలాంగులు ఉన్న ప్రతి ఇంటికి నా వంతుగా కొత్త వెలుగు పంచేందుకు కృషి చేస్తా. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవసరమైన సహాయక పరికరాలు పొందలేని వారికి అండగా నిలుస్తా. ఎవరికైనా అవసరం ఉంటే నా దృష్టికి తీసుకురండి” అని భాస్కర్ రెడ్డి తెలిపారు.
కేవలం కృత్రిమ అవయవాలు అందించడంతో కార్యక్రమం పూర్తికాదని, అవి లబ్ధిదారులకు సక్రమంగా ఉపయోగపడుతున్నాయా, వారి జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చాయో తెలుసుకోవడం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అందుకే స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నట్లు తెలిపారు.
ఒక సహాయం ఒక కుటుంబానికి భరోసా ఇవ్వడంతో పాటు, మరెందరో ముందుకు వచ్చి సేవ చేయాలనే స్ఫూర్తిని కలిగిస్తుందని పలువురు పేర్కొన్నారు. వికలాంగుల జీవితాల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ, వారికి అండగా నిలవాలనే భాస్కర్ రెడ్డి సేవా దృక్పథం నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


