రైస్ మిల్లర్లందరినీ ఒకే కోణంలో చూడొద్దు.. అధికారులకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ విన్నపం
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల బ్యూరో/అక్టోబర్ 8/ (జన సంఘర్షణ):
రైస్ మిల్లర్లలో కొంతమంది తప్పు చేస్తే, ఆ కారణంగా మొత్తం రైస్ మిల్లర్లపై ఆరోపణలు చేయడం సరికాదని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం రైస్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలతో పోస్టులు చేస్తున్నారని, రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మోహన్ రెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్రాల వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేయకుండా తాను అడ్డుకుంటున్నాననే ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తాను ఎక్కడా ధాన్యం లారీలను అడ్డుకోవడం లేదని, ఎప్పటికీ రైతుల పక్షానే ఉంటానని తెలిపారు.
*ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణలో ప్రభుత్వానికి రైస్ మిల్లర్ల….* తరఫున సహకారం అందిస్తామని చెప్పారు. రైతులకు ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడ ధాన్యం విక్రయించుకునే స్వేచ్ఛ ఉండాలని, రైతులకు లాభం జరిగే విధంగా ఎవరైనా ధాన్యం కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.
*తనపై వచ్చిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్…..!!!!* ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ఆయన కోరారు. ఆరోపణలు నిజమని తేలితే తాను బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారితో గాంధీచౌక్‌లో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
,*అధికారులకు ప్రత్యేక విన్నపం…
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున అధికారులకు మా విన్నపం.. కొంతమంది రైస్ మిల్లర్లు తప్పు చేసినట్లయితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ పదిమంది తప్పు చేస్తే అందరి మీద బురద జల్లడం, మొత్తం రైస్ మిల్లర్లను అనుమానంతో చూడడం సరికాదు. తప్పు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటూ, నిజాయితీగా వ్యాపారం చేస్తున్న రైస్ మిల్లర్లను ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని కోరుతున్నాం.
రైస్ మిల్లులపై వరుస దాడులు నిర్వహించడం కంటే, వాస్తవాలను నిర్ధారించి తప్పు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకోవాలని అధికారులను దయచేసి కోరుతున్నాం. రైతులకు, ప్రభుత్వానికి సహకరిస్తున్న రైస్ మిల్లర్లను కూడా ఒకే గాటన కట్టవద్దని విన్నవిస్తున్నాం.
ఈ సమావేశంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మోటూరి దయానంద్ గుప్తా, లాబిశెట్టి శ్రీనివాస్‌తో పాటు పలువురు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, మిల్లుల యజమానులు పాల్గొన్నారు.


