*శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత!!!!!*
* ఎలక్ట్రిక్ గీజర్‌లో దాచిన 7.75 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం.. ప్రయాణికుడి అరెస్ట్..
హైదరాబాద్, అక్టోబర్ 13 (జన సంఘర్షణ):
విదేశాల నుంచి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు నిఘా పెంచినప్పటికీ, స్మగ్లర్లు కొత్త మార్గాల్లో గంజాయిని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీగా హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రిక్ గీజర్‌లో దాచిన 7.75 కిలోల గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. దీని విలువ సుమారు రూ.2.71 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
*గీజర్‌లో 73 ప్యాకెట్లు.. అధికారుల తనిఖీల్లో వెలుగులోకి.!
అధికారులకు అందిన సమాచారం మేరకు అక్టోబర్ 12న బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ భారతీయ ప్రయాణికుడిని విమానాశ్రయంలో తనిఖీ చేశారు. అతడి చెక్-ఇన్ లగేజీలో ఉన్న ఎలక్ట్రిక్ గీజర్‌ను పరిశీలించగా, అందులో దాచిన 73 ప్యాకెట్లలోని అనుమానాస్పద పదార్థాన్ని గుర్తించారు.
నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్‌తో పరీక్షించగా అది హైడ్రోపోనిక్ గంజాయిగా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో మొత్తం 7.75 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
*ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు!!*
ఈ ఘటనలో పట్టుబడిన ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం-1985 కింద అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, దాని సరఫరా నెట్‌వర్క్‌కు సంబంధించిన వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
*మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అధికారుల నిఘా..!
విమానాశ్రయాల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు, నిఘా చర్యలు కీలకంగా మారాయి. ప్రయాణికుల లగేజీలో అనుమానాస్పద వస్తువులు గుర్తించినప్పుడు అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
— జన సంఘర్షణ


