Homeతెలంగాణపోతంగల్–కోటగిరి ప్రధాన రహదారిపై కుక్కలు, పందుల బెడద.. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు

పోతంగల్–కోటగిరి ప్రధాన రహదారిపై కుక్కలు, పందుల బెడద.. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు

📰 Generate e-Paper Clip

*పోతంగల్–కోటగిరి ప్రధాన రహదారిపై కుక్కలు, పందుల బెడద.. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు..!!*

 

*చికెన్ షాపుల వ్యర్థాలతో రోడ్డుపైకి చేరుతున్న కుక్కలు, పందులు.. నిత్యం ప్రమాదకరంగా మారుతున్న రహదారి.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.. తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్..!!*

 

నిజామబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో /నవంబర్ 10 | జన సంఘర్షణ

 

*పోతంగల్..!!* మండల కేంద్రం నుంచి కోటగిరి వెళ్లే ప్రధాన రహదారిపై కుక్కలు, పందుల సంచారం రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రహదారి పక్కనే ఉన్న చికెన్ షాపుల నిర్వాహకులు మాంసం వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండటంతో వాటిని తినేందుకు కుక్కలు, పందులు గుంపులుగా అక్కడికి చేరుతున్నాయి. దీంతో ప్రధాన రహదారి పరిసరాలు అపరిశుభ్రంగా మారడమే కాకుండా, వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నాయి.

 

*ప్రతిరోజూ ఈ మార్గంలో ద్విచక్ర వాహనాలు,..!!!* ఆటోలు, కార్లు, ఇతర భారీ వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయి. ఈ క్రమంలో రోడ్డుపైకి అకస్మాత్తుగా కుక్కలు, పందులు రావడంతో వాహనదారులు ఒక్కసారిగా బ్రేకులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వీటి సంచారం మరింత ఇబ్బందికరంగా మారుతోంది. వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

*వ్యర్థాల నిర్వహణపై పంచాయతీ యంత్రాంగం దృష్టి ఎక్కడ.!!*

 

*చికెన్ షాపుల నుంచి వెలువడే మాంసం..!!* వ్యర్థాలను సరైన పద్ధతిలో తొలగించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉన్నప్పటికీ, రోడ్డు పక్కన బహిరంగంగా పడేస్తుండటంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించాల్సిన గ్రామపంచాయతీ అధికారులు ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల దుర్వాసనతో పాటు పరిసరాల్లో అపరిశుభ్రత కూడా పెరుగుతోందని చెబుతున్నారు.

 

*ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తారా..!!*

 

ప్రజల రాకపోకలకు కీలకమైన ప్రధాన రహదారిపై ఇలాంటి పరిస్థితులు కొనసాగడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు స్పందించి చికెన్ షాపుల నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించడంతో పాటు రహదారి పరిసరాలను నిరంతరం శుభ్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

*అదేవిధంగా రహదారిపై సంచరిస్తున్న..!!!* కుక్కలు, పందుల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టి ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే సమస్యను పరిష్కరించడం అధికారుల బాధ్యత అని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.

 

*ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న..!!* ఈ సమస్యపై గ్రామపంచాయతీ అధికారులు ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే స్పందిస్తారా? లేక ప్రమాదం జరిగే వరకు ఎదురుచూస్తారా? అన్నది ఇప్పుడు పోతంగల్ మండల ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular