Homeతెలంగాణహైదరాబాద్కేపీహెచ్‌బీలో ప్రభుత్వ పాఠశాల స్థల పరిరక్షణకు ముందడుగు

కేపీహెచ్‌బీలో ప్రభుత్వ పాఠశాల స్థల పరిరక్షణకు ముందడుగు

📰 Generate e-Paper Clip

 –సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబుకు శేరి సతీష్ రెడ్డి కృతజ్ఞతలు.

 

హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు,నవంబర్ 12,(జన సంఘర్షణ):

ఉమ్మడి కేపీహెచ్‌బీ డివిజన్‌లో హౌసింగ్ బోర్డు లేఔట్‌లో పాఠశాల కోసం కేటాయించిన స్థలాన్ని అధికారికంగా ప్రభుత్వ పాఠశాల స్థలంగా గుర్తించేలా చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి శేరి సతీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ స్థలాన్ని ప్రభుత్వ పాఠశాల అవసరాలకు వినియోగించేలా అధికారిక చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి స్పందించి ముఖ్యమంత్రితో చర్చించి, సంబంధిత అధికారులను ఆదేశించడం ద్వారా ప్రభుత్వ పాఠశాల స్థలంగా గుర్తించే ప్రక్రియకు ముందడుగు పడిందని తెలిపారు.

గత బీఆర్‌ఎస్ పాలనలో ఎన్టీఆర్ పేరుతో పాఠశాల నిర్మిస్తామని డబ్బులు వసూలు చేసి, పిల్లర్లు వేసి పనులను అసంపూర్తిగా వదిలేశారని సతీష్ రెడ్డి ఆరోపించారు. పదేళ్ల కాలంలో పాఠశాల నిర్మాణాన్ని పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

అప్పటి కార్పొరేటర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణానికి ఏయే అనుమతులు తీసుకున్నారో, ఎంత మొత్తం వసూలు చేశారో, ఎంత ఖర్చు చేశారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో అధికారిక అనుమతులు లేకుండా ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు.

“ప్రభుత్వ స్థలం ప్రజల ఆస్తి. దానిని ఎవరూ తమ సొంత జాగీరుగా భావించకూడదు. పాఠశాల నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలనుకునేవారు సంబంధిత ప్రభుత్వ శాఖను సంప్రదించి, అధికారికంగా సహకరించాలి. నిర్మాణ పనులు ప్రభుత్వ పర్యవేక్షణలో, పారదర్శక విధానంలో జరగాలి” అని ఆయన స్పష్టం చేశారు.

పాఠశాలకు పేరు పెట్టడం కంటే విద్యార్థులకు నాణ్యమైన విద్య, పూర్తిస్థాయి భవనం, అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ స్థలంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణాన్ని పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

ప్రజల ఆస్తుల పరిరక్షణకు, ప్రభుత్వ విద్య బలోపేతానికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకి మరోసారి ధన్యవాదాలు తెలిపారు. తెలిపిన వారిలో బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, ఉమ్మడి కెపిహెచ్బి డివిజన్ మాజీ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్, కూకట్పల్లి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ సెల్ కన్వీనర్ మేకల మైఖేల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular