• గోవుల అక్రమ రవాణా, వసూళ్లపై దర్యాప్తు జరపాలి: బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్ డిమాండ్
• భద్రాచలం పవిత్రతను కాపాడాలి.. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి: కుంజా సంతోష్

భద్రాచలం సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకూ మితిమీరిపోతున్న గోవుల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్లు మరియు అమాయక ప్రజలను బెదిరిస్తున్న ఘటనలపై స్థానిక పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి సమగ్ర దర్యాప్తు జరపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది.
ఈ అక్రమ వ్యవహారాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్ ఆధ్వర్యంలో మంగళవారం భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ మరియు సీఐ నాగరాజుకు విడివిడిగా ఫిర్యాదు పత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్ విలేకరులతో మాట్లాడుతూ, దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి పవిత్ర పుణ్యక్షేత్రమని, అలాంటి ఆధ్యాత్మిక ప్రాంతంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని, దీనికి తోడు కొన్ని శక్తులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పెద్ద ఎత్తున బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కుంజా సంతోష్ ఆరోపించారు.
ఈ తరహా బెదిరింపులు, అక్రమ వసూళ్ల వల్ల స్థానిక వ్యాపారులు, సామాన్య ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని, పవిత్ర క్షేత్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా కొన్ని ముఠాలు ప్రవర్తిస్తున్నాయని కుంజా సంతోష్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్ ఎక్కడి వరకు విస్తరించింది? ఇందులో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న శక్తులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని కుంజా సంతోష్ అధికారులను కోరారు.
ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు భద్రాచలం దివ్య క్షేత్ర గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యత అని, పోలీసులు ఎవరి ఒత్తిళ్లకు లంగకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కుంజా సంతోష్ విజ్ఞప్తి చేశారు.
గోరక్షణ పేరుతో గానీ, ఇతర ఏ రూపంలోనైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై, బలవంతపు వసూళ్లకు పాల్పడే అక్రమార్కులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని ఈ సందర్భంగా కుంజా సంతోష్ పోలీసు అధికారులకు స్పష్టం చేశారు.
బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఇచ్చిన ఈ ఫిర్యాదుపై డీఎస్పీ, సీఐలు సానుకూలంగా స్పందించారని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమాలకు పాల్పడే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కుంజా సంతోష్ విలేకరులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు కుంజా ధర్మా, నిడదవోలు నాగబాబు, ముత్యాల శ్రీనివాస్, బోడ సత్యనారాయణ, సవలం వంశీలతో పాటు ధర్మ జాగరణ – గోరక్షక కమిటీ సభ్యులు సుబ్రమణ్యం, సిద్ధార్థ, పృథ్వీ, పూర్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.


