Homeతెలంగాణభద్రాద్రి కొత్తగూడెంహరీష్ రావు అరెస్టుపై లావుడ్యా సత్యనారాయణ నాయక్ తీవ్ర ఆగ్రహం

హరీష్ రావు అరెస్టుపై లావుడ్యా సత్యనారాయణ నాయక్ తీవ్ర ఆగ్రహం

📰 Generate e-Paper Clip

♦ సవాల్ విసిరి పోలీసుల చాటున దాక్కున్న కాంగ్రెస్ మంత్రులు

♦ నిజాయితీ ఉంటే అప్పుల లెక్కలపై చర్చకు భయమెందుకు..?

♦ కాంగ్రెస్ ది ప్రజాస్వామ్య పాలన కాదు.. పోలీసు పాలన: బిఆర్ఎస్

♦ నిజాలు బయటపెట్టే వరకు బిఆర్ఎస్ పోరాటం ఆగదు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల భారంపై చర్చకు రావాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాలును బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు స్వీకరించారు. ఈ నేపథ్యంలో చర్చ కోసం తెలంగాణ భవన్‌లో కుర్చీలు, సన్మాన శాలువాలు సిద్ధం చేసి ఎదురుచూశారు.

అయితే, చివరి నిమిషంలో మంత్రి జూపల్లి మాట మార్చి తాను గన్ పార్క్ వద్ద సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. దీంతో అక్కడికి బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావును, బిఆర్ఎస్ శ్రేణులను తెలంగాణ భవన్ వెలుపల భారీగా మోహరించిన పోలీసులు తోపులాటల మధ్య అడ్డుకుని, అక్రమంగా అరెస్టు చేశారు.

మంత్రి హరీష్ రావు  అక్రమ అరెస్టు పట్ల బిఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని, కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్యలను ఆయన తీవ్రస్థాయిలో ఖండించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలతో కాకుండా కేవలం పోలీసులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తోందని సత్యనారాయణ నాయక్ దుయ్యబట్టారు. సోషల్ మీడియా పోస్టుల దగ్గరి నుండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే బిఆర్ఎస్ సీనియర్ నాయకులపై పోలీసులతో దాడులు చేయించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందన్నారు.

ఒకవైపు చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరి, తీరా చర్చకు వస్తుంటే పోలీసులను పెట్టి అరెస్టులు చేయించడం కాంగ్రెస్ నాయకుల చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. మీరు ఎలాంటి అవినీతికి పాల్పడనప్పుడు చర్చకు రావడానికి ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడానికి కేటీఆర్, హరీష్ రావు సిద్ధమవగా.. కాంగ్రెస్ నాయకులు దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చర్చల నిమిత్తం హరీష్ రావు స్వయంగా ఫోన్ చేసినా, ముగ్గురు మంత్రులు కనీసం ఫోన్ లిఫ్ట్ చేయకుండా పిరికిపందల్లా తప్పించుకున్నారని ఆరోపించారు.

విద్యాశాఖలో స్కామే జరగకపోతే, అప్పుల లెక్కలు తప్పు కాకపోతే చర్చకు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న భయం ఏంటని సత్యనారాయణ నాయక్ ప్రశ్నించారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్, హరీష్ రావులతో నేరుగా చర్చకు రావాలని ఆయన కాంగ్రెస్ మంత్రులకు సవాల్ విసిరారు.

ప్రజలు ప్రభుత్వ వైఖరిని నిశితంగా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పోలీసులను పెట్టి తమను నిలువరించాలని చూస్తే ఊరుకునేది లేదని, నిజాలు బయటపెట్టే వరకు బిఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular