— రూ. 5,000/- వేల రూపాయల చెక్కును అందజేసిన అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు.
–ప్రమాదంలో రూ.20 లక్షల ఆస్తినష్టం.
హైదరాబాద్ సిటీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి నాగుల అంజిబాబు, ఆగస్టు15, (జన సంఘర్షణ):
కూకట్పల్లి ట్రినేత్రం రిపోర్టర్ గుండా మనోహర్ ఇల్లు శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు పూర్తిగా దగ్ధమై సుమారు రూ. 20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఫైర్ ఇంజిన్ తో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు భారీగా చెలరేగడంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ పూర్తిగా కాలిపోయింది. అదేవిధంగా విలువైన గృహోపకరణాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉంచిన రెండు తులాల 50 గ్రాముల బంగారు నగలు, 8 తులాల వెండి, రూ.28,000 నగదు, వస్తువులు,బట్టలు, ఫర్నీచర్ ఇంటిలోని సామాగ్రి అంతా మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఒంటిపై ఉన్న బట్టలతోనే మిగిలిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనతో నిరుపేద కుటుంబానికి చెందిన మనోహర్ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో సంఘటన స్థలానికి కూకట్పల్లి ప్రెస్ క్లబ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యుజేఎఫ్) అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు (జనరల్ సెక్రటరీ) ఇంటిని పరిశీలించి రూ. 5000/- వేల రూపాయల చెక్కును మనోహర్ కి అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎర్ర యాకయ్య మాట్లాడుతూ జర్నలిస్టు మిత్రులు, బిల్డర్లు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు మానవతా దృక్పథంతో స్పందించి, తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని పంపించి రిపోర్టర్ మనోహర్ కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కావున దాతలు కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అకౌంట్ నెంబర్ : 79086138295, IFSC Code: TGRB0000158 కి ఆర్థిక సాయం అందజేయాలని కోరారు.


