హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు,సెప్టెంబర్ 24,(జన సంఘర్షణ):
తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా పరుచూరి సురేష్ గౌడ్ నియమితులయ్యారు. గురువారం సెప్టెంబర్ 24 హైదరాబాద్‌లోని సంఘం కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రామచంద్ర రావు చేతుల మీదుగా పరుచూరి సురేష్ గౌడ్ అధికారికంగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ ప్రధాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గుండాల మల్లేష్ గౌడ్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. సురేష్ గౌడ్‌తో పాటు ఇదే వేదికపై వివిధ జిల్లాలకు చెందిన పలువురు నాయకులు కూడా బాధ్యతలు స్వీకరిస్తూ నియామక పత్రాలు అందుకున్నారు. వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కొండ రాధ గౌడ్ నియామక పత్రం అందుకోగా, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నర్సింగ్ యమున గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏరుకొండ హైమవతి గౌడ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గండి వీరేందర్ గౌడ్ తదితరులు వివిధ బాధ్యతలు స్వీకరించిన వారిలో ఉన్నారు. హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పరుచూరి సురేష్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. నగర పరిధిలో గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా గౌడ మహిళలకు, యువతకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తామని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గౌడ సమాజం మరింత అభివృద్ధి చెందేలా తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరుచూరి సురేష్ గౌడ్ మాట్లాడుతూ.. తనకు ఈ బాధ్యతలు దక్కడంలో రాష్ట్ర అధ్యక్షుడు గుండాల మల్లేష్ గౌడ్ తోడ్పాటు, సహకారం ఎంతో ఉందని, ఆయన అందించిన ప్రోత్సాహం మరవలేనిదని పేర్కొంటూ మల్లేష్ గౌడ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనను సిటీ అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రామచంద్ర రావుకి, ఇతర రాష్ట్ర మరియు జిల్లా గౌడ సంఘం పెద్దలందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.


