Homeతెలంగాణబీర్కూర్ ప్రధాన రహదారి దుస్థితి!

బీర్కూర్ ప్రధాన రహదారి దుస్థితి!

📰 Generate e-Paper Clip

పట్టించుకోని కాంట్రాక్టర్.. నిద్రమత్తులో రోడ్లు భవనాల శాఖ?

బీర్కూర్,/సెప్టెంబర్ 24/(జన సంఘర్షణ)

బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మురికి నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా సమస్య కొనసాగుతున్నా శాశ్వత పరిష్కారం చూపలేదని వారు ఆరోపిస్తున్నారు.

ప్రధాన రహదారిపై మురికి నీరు ప్రవహించకుండా కల్వర్టు నిర్మించి, మురికి కాలువలను అనుసంధానం చేయాల్సి ఉన్నప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో మురుగు నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో రహదారి బురదమయంగా మారడంతో వాహనదారులు, పాదచారులు, విద్యార్థులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు.బీర్కూర్‌కు రాకపోకలకు ఈ రహదారి కీలకమైనదని, పాఠశాల విద్యార్థులు, ప్రజలు వివిధ అవసరాల కోసం ఇదే మార్గంలో ప్రయాణిస్తుంటారని స్థానికులు తెలిపారు. సమస్యపై కాంట్రాక్టర్‌తో పాటు సంబంధిత రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించి పనులను పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.

సెంట్రల్ లైటింగ్ పనులు ఎక్కడ?

బాన్సువాడ–బీర్కూర్ ప్రధాన రహదారిపై రూ.39 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులకు నిధులు మంజూరైనప్పటికీ పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళ రహదారి చీకటిమయంగా మారడంతో డివైడర్లు వాహనదారులకు స్పష్టంగా కనిపించక ప్రమాదాల ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

* రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి

ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజకీయాలను పక్కనపెట్టి గ్రామాభివృద్ధికి పాలకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్థానికులు కోరుతున్నారు. రాజకీయ కారణాలతో అభివృద్ధి పనులు నిలిచిపోతే ప్రజలే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బీర్కూర్ ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న మురుగు నీటికి శాశ్వత పరిష్కారం చూపాలని, కల్వర్టు నిర్మాణం పూర్తి చేసి మురికి కాలువలను అనుసంధానం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే సెంట్రల్ లైటింగ్ పనులను త్వరగా పూర్తి చేసి రాత్రి వేళ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తూ బురదమయంగా మారిన దృశ్యాలను ‘మన తెలుగు జన సంఘర్షణ పత్రిక’ తన కెమెరాలో బంధించింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular