అధికార పార్టీ కౌన్సిలర్లకే ప్రాధాన్యత… స్థానిక కళాకారులకు మొండిచేయి: సదుపాయాలు లేక భక్తుల తీవ్ర అసహనం!
ప్రజాధనమా? నాయకుల సొంత సొమ్మా?: ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ విఐపి గ్యాలరీల హంగామా!
బాధ్యత మరిచిన మున్సిపల్ అధికారులు: యార్డ్ ప్రదర్శన పేరిట దందాలు… జర్నలిస్టులకు దక్కని కనీస గౌరవం
‘దక్షిణ మైసూర్’గా ప్రసిద్ధి చెందిన ఇల్లెందు పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా (జమ్మి) ఉత్సవాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. పరంపరాగతంగా వస్తున్న ఆచార వ్యవహారాలను పక్కనపెట్టి, నిర్వహణ బాధ్యతలను అధికారులు పూర్తిగా విస్మరించడంతో ఈసారి ఉత్సవాలు ఆభాసుపాలయ్యాయి. పద్ధతి, ప్రణాళిక లేకుండా ఇష్టారీతిగా వ్యవహరించడం, కనీస ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో వేడుకలకు వచ్చిన ప్రజలు, పాత్రికేయులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ప్రజాధనంతో పాటు ప్రజలు, వ్యాపారుల నుంచి సేకరించిన నిధులతో నిర్వహించిన ఈ వేడుకల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. మున్సిపాలిటీ కేటాయించిన నిధులు సరిపోవని చెప్పి, ఉత్సవాల పేరిట ప్రజలు, వ్యాపారుల నుంచి భారీగా చందాలు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా యార్డ్ ప్రదర్శనలు ఇస్తామని చెప్పి స్థానిక వ్యాపారుల వద్ద డబ్బులు సేకరించి, తీరా నిర్వహణ సమయానికి తమ యార్డులు వేయలేదని, ఇంతకంటే అన్యాయం మరొకటి లేదని బాధితులు బహిరంగంగా వాపోతున్నారు.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా ప్రతినిధుల పట్ల మున్సిపల్ అధికారులు, నిర్వాహకులు ప్రవర్తించిన తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత అనేక సంవత్సరాలుగా విలేకరులను, వారి కుటుంబ సభ్యులను గౌరవంగా ఆహ్వానించే సంప్రదాయం ఉండగా, ఈసారి మీడియాపై ఆంక్షలు విధించారు. స్వయంగా సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు హాజరైన కార్యక్రమంలో కూడా విలేకరులకు పాస్లు ఇవ్వకపోవడం, వారిని, వారి కుటుంబ సభ్యులను ప్రైవేట్ బౌన్సర్లు మరియు పోలీసులతో అడ్డుకోవడం జర్నలిస్టుల హక్కులను కాలరాయడమేనని విమర్శలు వస్తున్నాయి.
ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని ప్రైవేటు బౌన్సర్ల భద్రత కోసం ధారబోయడం మరొక పెద్ద తప్పుగా మారింది. ఈ బౌన్సర్లు కేవలం అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే సెక్యూరిటీ ఇస్తూ, వివిఐపి గ్యాలరీలకు తీసుకువెళ్లి సకల మర్యాదలు చేశారు. ప్రజాధనంతో నిర్వహించే కార్యక్రమంలో అధికార పార్టీ వర్గాలకే ప్రాధాన్యత ఇవ్వడంపై ‘ఇది ప్రజాధనమా లేక నాయకుల సొంత సొమ్మా?’ అని స్థానిక ప్రజలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.
ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమాలకు కంచుకోటగా ఉన్న ఇల్లెందులో సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు దక్కిన పరాభవం అంతా ఇంతా కాదు. కనీసం స్టేజి వద్దకు వెళ్లడానికి గానీ, ఆ ప్రాంగణంలో నిలబడటానికి గానీ అవకాశం ఇవ్వకుండా పోలీసులు, బౌన్సర్లు వారిని తోసివేయడం కలకలం రేపింది. చివరికి కాంగ్రెస్ మిత్రపక్షాలకు చెందిన నాయకులకు కూడా పాస్లు అందకపోవడంతో వారు తీవ్ర అసహనానికి గురై, ఈ విషయంపై పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చిస్తున్నట్లు సమాచారం
రాజకీయ వివక్షతో పాటు సొంత పార్టీ కౌన్సిలర్లను కూడా పక్కనబెట్టడం ఉత్సవాల లోపాలను ఎత్తిచూపుతోంది. సద్దుల బతుకమ్మ నుంచి దసరా వరకు కొంతమంది కౌన్సిలర్లకే ప్రాధాన్యత ఇస్తూ, తక్కిన వారికి పాసులు ఇవ్వకుండా నిరుత్సాహపరిచారు. మరోవైపు 13వ వార్డు BRS కౌన్సిలర్ దండు సారయ్య మరియు వారి మిత్రబృందం ఉచితంగా డాన్స్ ప్రదర్శన ఇస్తామని ముందస్తుగా అనుమతి కోరినప్పటికీ, అధికార పార్టీ ఒత్తిళ్లతో అవకాశం నిరాకరించారు. లక్షల రూపాయలు వెచ్చించి బయటి కళాకారులను తీసుకువచ్చి, స్థానిక కళాకారులను ప్రోత్సహించకపోవడం వెనుక పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం దాగి ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్సవాలకు హాజరైన వేలాది మంది భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ యంత్రాంగం దారుణంగా విఫలమైంది. కనీసం మంచినీటి సదుపాయం కల్పించిన ప్రాంతాల్లో కూడా పరిశుభ్రత పాటించకపోవడంతో, తాగునీటి కోసం వచ్చిన ప్రజలు అక్కడి అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి నీరు కూడా తాగకుండా వెనుతిరిగిపోయారు. దసరా వేడుకల నిర్వహణ పర్యవేక్షణ పూర్తిగా కొరవడటంతో భక్తులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు, మీడియాపై ఆంక్షలు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే మౌనం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీలోని ఒక నిర్దిష్ట వర్గానికి కొమ్ముకాస్తూ అధికారులు, నిర్వాహకులు వ్యవహరించడం వల్లనే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయని స్పష్టమవుతోంది. ఇప్పటికైనా మీడియా స్వేచ్ఛను పరిరక్షించి, ఉత్సవాల పేరిట జరిగిన నిధుల వసూళ్లు, అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఇల్లెందు ప్రజలు, సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


