Homeతెలంగాణభద్రాద్రి కొత్తగూడెంఅధికారులను కాపాడేందుకు ‘స్క్రీన్ ప్లే’ నడుస్తోందా?: పీవీకే గని అప్రెంటిస్ మృతిలో అసలు నిజాలు బయటపడేనా?

అధికారులను కాపాడేందుకు ‘స్క్రీన్ ప్లే’ నడుస్తోందా?: పీవీకే గని అప్రెంటిస్ మృతిలో అసలు నిజాలు బయటపడేనా?

📰 Generate e-Paper Clip

• ఉద్యోగం ఇస్తామని బట్టలు ఉతికించుకున్నారా?

• రాము అనే ఉద్యోగి దాడి వల్లే వసుమతి ఆత్మహత్య?

• తోటి మహిళా అధికారుల వేధింపులే ప్రాణం తీశాయా?

• పెద్ద తలకాయలను తప్పించే కుట్ర జరుగుతోందా?

• వసుమతి సోదరి శ్రావణి ఫిర్యాదుతో కదులుతున్న పోలీసులు!

• బూట్లు తుడవాలంటూ బెదిరింపులు నిజమేనా?: వసుమతి ఆత్మహత్య కేసులో బయటపడుతున్న దిగ్భ్రాంతికర నిజాలు!

• సింగరేణి యాజమాన్యం మౌనం వీడేనా?: బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఆశల సింగరేణిలో ఊహించని విషాదం

సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మహిళలు పురుషులతో సమానంగా అడుగుజాడలు వేస్తూ భూగర్భ గనుల్లో సైతం కదం తొక్కుతున్నారు. మజ్జూర్ స్థాయి నుంచి మేనేజర్ స్థాయి వరకు అన్ని విభాగాల్లోనూ తమ సత్తా చాటుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. కానీ, నాణేనికి ఒకవైపు వెలుగు ఉంటే.. మరోవైపు కంటికి కనపడని చీకటి కోణాలు కూడా దాగి ఉన్నాయి అనడానికి తాజాగా జరిగిన ఘటనే నిదర్శనం.

చికిత్స పొందుతూ కన్నుమూసిన గిరిజన యువతి

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన బిజ్జ వసుమతి (23) కొత్తగూడెం ఏరియా 5షాఫ్ట్ (PVK-5) పరిధిలో అప్రెంటీస్‌గా చేరుతోంది. కొత్తగూడెంలోని బాబూక్యాంపులో అద్దె ఇంట్లో నివాసముంటున్న ఈ గిరిజన యువతి, గత నెల 9వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర పరిస్థితిలో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆమె కన్నుమూసింది.

తొలి అనుమానం: తోటి ఉద్యోగి రాము వ్యవహార శైలి?

ప్రాథమిక పత్రికా కథనాల ప్రకారం.. వసుమతి పనిచేసే చోట రాము అనే సింగరేణి ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. వసుమతి అతడిని తండ్రి సమానుడిగా భావించి చనువుగా ఉండేదని తెలుస్తోంది. అయితే ఇటీవల రాము ఆమెపై దాడి చేసి కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్యకు యత్నించిందని ఒక కోణంలో ప్రచారం జరుగుతోంది.

తెరపైకి కొత్త ట్విస్ట్: ఉన్నతాధికారుల వేధింపులే కారణమా?

ఈ వ్యవహారంలో కేవలం వ్యక్తిగత గొడవలే కాకుండా సరికొత్త ట్విస్ట్‌లు తెరపైకి వస్తున్నాయి. పని నేర్చుకోవడానికి వచ్చిన ఒక అప్రెంటిస్ మహిళా ఉద్యోగినిని అదే గనిలో పనిచేస్తున్న కొందరు మహిళా ఉన్నతాధికారులు తీవ్రమైన మానసిక వేధింపులకు గురిచేశారనే బలమైన ఆరోపణలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.

బట్టలు ఉతకాలని.. బూట్లు తుడవాలని బెదిరింపులు?

మైనింగ్ పనులు, సాంకేతిక విషయాలు నేర్చుకోవడానికి వస్తే.. సదరు మహిళా ఉన్నతాధికారులు తమ సొంత పనులైన బట్టలు ఉతకాలని, బూట్లు శుభ్రంగా ఉంచాలని వసుమతిని వేధించినట్లు గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాము చెప్పినట్టు వినకుంటే భవిష్యత్తు నాశనం చేస్తామంటూ బెదిరింపులకు దిగడం వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పెద్ద తలకాయలను కాపాడేందుకు చిరుద్యోగి బలి?

తోటి మహిళ మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన ఈ మహిళా అధికారులకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) స్థాయి పెద్ద అధికారులు వత్తాసు పలికారని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో అసలు సూత్రధారులైన ఉన్నతాధికారుల తప్పులను కప్పిపుచ్చి, కేవలం చిరుద్యోగి అయిన రాము చుట్టూనే కేసును తిప్పి అతడిని బలిపశువును చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మహిళల ఉద్యోగ మనుగడకు జవాబు లేని ప్రశ్నలు

సాధారణంగా మహిళలపై అన్యాయం జరిగితే పురుషులపై ఆరోపణలు వస్తాయి. కానీ ఇక్కడ తోటి మహిళా అధికారులే ఒక గిరిజన యువతి జీవితంతో ఆడుకున్నారనే విమర్శలు రావడం కొసమెరుపు. ఈ ఘోర ఘటన భవిష్యత్తులో సింగరేణి సంస్థలో పనిచేసేందుకు ముందుకు వచ్చే యువతుల మరియు మహిళల భద్రతపై జవాబు లేని ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది.

కార్మిక, గిరిజన సంఘాల తీవ్ర ఆగ్రహం

ఎన్నో ఆశలతో అప్రెంటిస్ పూర్తి చేసి సింగరేణిలో మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న గిరిజన బిడ్డ మృతిపై పలు గిరిజన సంఘాలు, కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఈ ఆత్మహత్యకు కారణమైన ప్రతి ఒక్కరిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పోలీసుల లోతైన దర్యాప్తుతోనే నిజాలు బయటపడేనా?

ప్రస్తుతం మృతురాలి సోదరి శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తగూడెం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ముప్పారపు కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ కేసును కేవలం ఒకే కోణంలో కాకుండా, అటు రాము చేసిన దాడి మరియు ఇటు ఉన్నతాధికారుల వేధింపుల ఆరోపణలు.. రెండింటిపై నిష్పాక్షికంగా విచారణ జరపాల్సి ఉంది.

సింగరేణి యాజమాన్యం భరోసా కల్పిస్తుందా?

ఈ గిరిజన బిడ్డ మృతికి కారణమైన అసలు నిందితులు ఎంతటి వారైనా, ఏ హోదాలో ఉన్నా సింగరేణి యాజమాన్యం సమగ్ర విచారణ జరిపించి శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందా? బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసి, గనుల్లో పనిచేస్తున్న ఇతర మహిళా ఉద్యోగుల్లో భయాన్ని పోగొట్టి వారికి సింగరేణి అధికారులు ఎలాంటి భరోసా ఇస్తారో వేచి చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular