Homeతెలంగాణహైదరాబాద్హైదరాబాద్‌లో నకిలీ పోలీస్ ముఠా అరెస్ట్: తుపాకులు, పోలీస్ కార్లు స్వాధీనం

హైదరాబాద్‌లో నకిలీ పోలీస్ ముఠా అరెస్ట్: తుపాకులు, పోలీస్ కార్లు స్వాధీనం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌లో పోలీసుల పేరుతో చలామణి అవుతూ, ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఒక ప్రమాదకరమైన నకిలీ పోలీస్ ముఠాను కూకట్‌పల్లి సీసీఎస్, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు చెందిన ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన పూర్ణచందర్ రావుపై గతంలో హర్యానాలో నమోదైన ఒక కేసును సాకుగా చూపి, ఈ ముఠా అతడిని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసింది. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిఘా పెట్టి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు.

ఈ ఘరానా మోసాలకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నాగరాజు రఘువర్మ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. విచారణలో రఘువర్మపై గతంలోనే రెండు సార్లు పీడీ యాక్ట్ నమోదైనట్లు తేలింది. అయినప్పటికీ అతడు బుద్ధి మార్చుకోకుండా, పోలీస్ అధికారిగా నటిస్తూ అమాయకులను మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి పోలీస్ స్టిక్కర్లు ఉన్న రెండు కార్లు, ఒక దేశీయ తుపాకీ, ఒక ఎయిర్ గన్, మరియు పోలీస్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించగా.. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ అధికారుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular