పండుగల వేదికలపై అశ్లీల నృత్యాలు, పాటలను నిషేధించాలి: విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ డిమాండ్
భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో అశ్లీలత వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి
సంస్కృతిని పరిరక్షించేలా భరతనాట్యం, కూచిపూడి, హరికథలకు ప్రాధాన్యమివ్వాలి
మున్సిపల్ అధికారులు దేవుళ్లను కించపరిచేలా వేదికలు ఏర్పాటు చేయవద్దు: ఇల్లందు వీహెచ్‌పీ స్పష్టం
ఇల్లందు నియోజకవర్గంలో వైభవంగా జరుపుకునే వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేసే వేదికలపై అశ్లీల పాటలు పాడించడం, అశ్లీల నృత్యాలు చేయించడాన్ని తక్షణమే నిలిపివేయాలని విశ్వహిందూ పరిషత్ మరియు భజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్యకు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి:
పవిత్రమైన పండుగ రోజులైన బతుకమ్మ, దసరా వేడుకల్లో అశ్లీల పాటలు వినడం వల్ల హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ప్రతినిధులు ఎమ్మెల్యేకు వివరించారు. లక్ష్ల సంవత్సరాల నుంచి సనాతన ధర్మంలో వస్తున్న సాంప్రదాయాలను గౌరవిస్తూ, ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుకుంటుంటే వేదికలపై ఇటువంటి ప్రదర్శనలు ఇవ్వడం అభ్యంతరకరమని పేర్కొన్నారు.
కుటుంబ సమేతంగా వచ్చే ప్రజలకు ఇబ్బందులు:
జమ్మి పూజలు, రావణ దహనం వంటి కార్యక్రమాలకు ప్రజలు కుటుంబ సమేతంగా వస్తారని, అయితే ఆ సమయంలో ఆర్కెస్ట్రా ద్వారా అశ్లీల పాటలు, నృత్యాలు వేయడం వల్ల సభలకు వచ్చే మహిళలు, చిన్న పిల్లలు తీవ్ర తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
చిన్నపిల్లల మనస్సులపై దుష్ప్రభావం:
వేదికలపై ప్రదర్శించే అశ్లీలతల వల్ల చిన్నపిల్లల మనస్సులలో అశ్లీల భావాలు నాటుకుపోతున్నాయని వారు తెలిపారు. పవిత్రమైన జమ్మి ప్రాంగణంలో అపవిత్రమైన వాతావరణం ఏర్పడి, ఆకతాయి మూకలు పెరిగిపోయి అమ్మాయిలను, మహిళలను గేలిచేసే ప్రమాదం ఉందన భయాందోళన వ్యక్తం చేశారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం:
పండుగ వేదికలపై ఇటువంటి ప్రదర్శనలు నిర్వహించడం వల్ల సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని వీహెచ్‌పీ నేతలు అభిప్రాయపడ్డారు. పవిత్రమైన రోజుల్లో దేవుళ్లను కించపరిచేలా అధికారులు ఏర్పాట్లు చేయడం వల్ల ప్రతి ఒక్కరూ పాపం మూటకట్టుకోవడమే కాకుండా దైవాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాజకీయాలు, మతాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలి:
ఇల్లందు పురపాలక సంఘం అధికారులు, పాలకవర్గ ప్రతినిధులు ప్రతీ ఒక్కరూ మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఆలోచన చేయాలని కోరారు. దేవుడిని, పండుగలను కించపరిచే విధంగా కాకుండా, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.
సంస్కృతి, సాంప్రదాయ కళలకు ప్రాధాన్యత ఇవ్వాలి:
అశ్లీల ప్రదర్శనల స్థానంలో భరతనాట్యం, కూచిపూడి వంటి సాంప్రదాయ నృత్యాలు, హరికథలు, రామాయణ, మహాభారత, భాగవత పురాణాల ప్రవచనాలు ఏర్పాటు చేయాలని కోరారు. భగవద్గీత శ్లోకాలు చెప్పే ప్రవచన కర్తలను పిలిపించి, హిందూ ధర్మంలోని దేవీదేవతల ప్రాశస్త్యాన్ని వివరించేలా పూజలు, శ్లోకాల పఠనం నిర్వహించాలని సూచించారు.
సనాతన ధర్మ విలువలను కాపాడాలి:
భావితరాలకు మన సనాతన ధర్మం పట్ల గౌరవం, విలువలు, భయభక్తులు పెంపొందించే బాధ్యత మనందరిపై ఉందని, అందుకు తగ్గట్టుగా సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే ఏర్పాటు చేయాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ప్రఖండ అధ్యక్షులు దండమూడి శ్రీనివాస్ (DK శ్రీను), కార్యదర్శి జానకి రామ్, ప్రఖండ సంయోజక్ శివం రాజపుత్, పట్టణ సంయోజక్ బొడ్డుపల్లి అఖిల్, గోరక్షక్ కడ్డిగాల సతీష్ నాయుడు తదితరులు కోరారు.


