–విజ్ఞత, విచక్షణ, నైతికతతోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి మేలు.
–యూట్యూబ్ యుగంలో డిజిటల్ జర్నలిజంపై విద్యార్థులకు క్లుప్తంగా వివరణ.
హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, అక్టోబర్ 06, (జన సంఘర్షణ):
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్య విసి వెల్దండ నిత్యానందరావు, ఆచార్య రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు సహకారంతో జర్నలిజం శాఖ ఆధ్వర్యంలో బాచుపల్లి ప్రాంగణంలోని జీ.వీ సుబ్రహ్మణ్యం సెమినార్ హాల్ పరిపాలనా భవనంలో సోమవారం రోజు మీడియా మంథన్ – 2026 సెమినార్, వర్క్ షాప్, ముఖాముఖి ప్రత్యేక కార్యక్రమం డీన్ ఆచార్య బి.హెచ్. పద్మప్రియ పర్యవేక్షణలో అధ్యాపకులు డా. షేక్ హసీనా, డా. కె. అనిత సమన్వయంతో, జర్నలిజం విద్యార్థులు, పరిశోధకులు, మీడియా రంగంపై ఆసక్తి ఉన్న వారందరూ పాల్గొని విజయవంతం చేశారు. ముఖ్య అతిథులుగా సీనియర్ జర్నలిస్ట్ గుండవజ్జుల జ్యోతిర్మయి పరిశోధనల్లో కృత్రిమ మేధ విశ్లేషణ, సీనియర్ జర్నలిస్టు, కంటెంట్ క్రియేటర్ నోముల తిరుమల్ రెడ్డి హాజరై యూట్యూబ్ యుగంలో డిజిటల్ జర్నలిజం గురించి భవిష్యత్తులో జర్నలిజం అభ్యసించే విద్యార్థులకు క్షుణ్ణంగా తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ గుండవజ్జుల జ్యోతిర్మయి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దాని వినియోగంలో విజ్ఞత, విచక్షణ, నైతికత అత్యంత కీలకమని పేర్కొన్నారు. సాంకేతికతను కేవలం అభివృద్ధి కోసం కాకుండా మానవాళి సంక్షేమానికి ఉపయోగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, జర్నలిజం, పరిపాలన తదితర అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతోంది. సమాచారాన్ని వేగంగా విశ్లేషించడం, క్లిష్టమైన సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించడం, సమయాన్ని ఆదా చేయడం వంటి అనేక ప్రయోజనాలను ఏఐ అందిస్తోంది. అయితే, దీనిని బాధ్యతారహితంగా ఉపయోగిస్తే తప్పుడు సమాచారం, గోప్యతకు భంగం, మానవ విలువలకు విఘాతం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, ఈ నేపథ్యంలో విజ్ఞత, విచక్షణ, నైతికత ఈ మూడు అంశాలను సమన్వయం చేసుకుంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి మనుగడకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏఐ అందించే సమాచారాన్ని యథాతథంగా నమ్మకుండా, దాని నిజానిజాలను పరిశీలించే విచక్షణ ప్రతి వినియోగదారుడికి అవసరం అని ముఖ్యంగా జర్నలిజం, విద్య, ప్రజా సమాచార రంగాల్లో ఏ ఐ ద్వారా లభించే సమాచారాన్ని వాస్తవాలతో సరిపోల్చి నిర్ధారించుకోవడం అత్యంత ముఖ్యం అని అదేవిధంగా ఏ ఐ వినియోగంలో నైతికతకు పెద్దపీట వేయాలి. వ్యక్తుల గోప్యతను కాపాడటం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండటం, సాంకేతికతను దుర్వినియోగం చేయకుండా చూడటం వంటి అంశాలు ప్రతి ఒక్కరి బాధ్యతగా మారాయని ఏ ఐ మనిషికి ప్రత్యామ్నాయంగా కాకుండా, మనిషి సామర్థ్యాలను మరింత పెంచే సాధనంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవ విలువలతో అనుసంధానం చేసినప్పుడే సమాజానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. భవిష్యత్తులో ఏఐ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందున, దాని వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు విద్యా సంస్థలు, ప్రభుత్వాలు, సాంకేతిక నిపుణులు, మీడియా సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. విజ్ఞతతో సాంకేతికతను అర్థం చేసుకుని, విచక్షణతో దాన్ని వినియోగించి, నైతికతతో దిశానిర్దేశం చేసినప్పుడే ఏఐ మానవాళికి వరంగా మారుతుందని జ్యోతిర్మయి మాట్లాడారు. కంటెంట్ క్రియేటర్ నోముల తిరుమల్ రెడ్డి యూట్యూబ్ యుగంలో డిజిటల్ జర్నలిజంపై అవగాహనా ప్రసంగం మాట్లాడుతూ యూట్యూబ్, సోషల్ మీడియా వంటి డిజిటల్ వేదికలు జర్నలిజం స్వరూపాన్ని వేగంగా మారుస్తున్న నేపథ్యంలో జర్నలిస్టులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ప్రముఖ జర్నలిస్టు నోముల తిరుమల్ రెడ్డి అన్నారు. మీడియా మంథన్–2026” కార్యక్రమంలో భాగంగా “యూట్యూబ్ యుగంలో డిజిటల్ జర్నలిజం కంటెంట్, పరిధి, ఆదాయ మార్గాలు” అనే అంశంపై విద్యార్థులకు ఆయన ప్రత్యేక గెస్ట్ లెక్చరర్ నిర్వహించారు. దాదాపు 23 సంవత్సరాల జర్నలిజం అనుభవాన్ని కలిగిన తిరుమల్ రెడ్డి, రేడియో జాకీగా తన కెరీర్ను ప్రారంభించి ఎలక్ట్రానిక్ మీడియా నుంచి డిజిటల్ మీడియా వరకు సాగిన తన ప్రయాణాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. జీ తెలుగు, సాక్షి, టీవీ9 తదితర ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవాలను వివరించారు. డిజిటల్ జర్నలిజంలో కంటెంట్ ఎంపిక, ప్రేక్షకులను ఆకట్టుకునే విధానం, యూట్యూబ్ ద్వారా వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లే పద్ధతులు, సోషల్ మీడియా వేదికల వినియోగం, డిజిటల్ మీడియా ద్వారా ఆదాయ అవకాశాలు వంటి అంశాలపై ఆయన వివరంగా మాట్లాడారు. జర్నలిజం అంటే కేవలం వార్తలను అందించడం మాత్రమే కాదని, ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంతో పాటు సమాజాన్ని అప్రమత్తం చేయడం కూడా జర్నలిస్టుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. తిరుమల్ రెడ్డి ప్రసంగానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. డిజిటల్ మీడియా రంగంలో ఎదురవుతున్న అవకాశాలు, సవాళ్లపై ఆయన అందించిన సూచనలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు నోముల తిరుమల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అతిధులకు శాలువాతో ఘనంగా సన్మానం చేసి, జర్నలిజం విద్యార్థులు రచించిన అంజిబాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రచురించిన గురు దక్షిణ కవితా సంకలన పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిజం అధ్యాపకులు డా. షేక్ షమీర్, రీసెర్చ్ స్కాలర్ గోపాల్, డా. పి. వెంకటేశ్వరరావు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


